ఎనిమిదో ఖండం జిలాండియా.. కొత్త ఖండాన్ని కనుగొన్న పరిశోధకులు
ఆక్లాండ్: భూ గోళంపై మొత్తం ఎన్ని ఖండాలు ఉన్నాయి? అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే.. ఠక్కున ఏడు అని సమాధానమిస్తారు. అయితే ఇకపై ఎనిమిది అని సమాధానమివ్వాల్సి ఉంటుంది. సుమారు 375 ఏండ్ల తర్వాత పరిశోధకులు కొత్త ఖండాన్ని కనుగొన్నారు. 2017లోనే వెలుగులోకి వచ్చిన ఈ ఖండం ఉనికిని తాజాగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆక్లాండ్‌లో ఉన్న న్యూజిలాండ్ క్రౌన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ జీఎన్‌ఎస్ సైన్స్ పరిశోధకులు ఈ మేరకు కొత్త ఖండం మ్యాప్‌ను విడుదల చేశారు. దీంతో ఇప్పటికే ఉనికిలో ఉన్న ఏడు ఖండాలకు తోడు కొత్తగా జిలాండియా వచ్చి చేరింది. దీంతో మొత్తం ఖండాల సంఖ్య ఎనిమిదికి చేరే ఆస్కారం ఉంది.
గోండ్వానా నుంచి వేరుపడి…
అతి ప్రాచీన ఖండం గోండ్వానాలో భాగమైన జిలాండియా కాలక్రమేణా వేరుపడినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ఖండం మొత్తం విస్తీర్ణం 4.9 మిలియన్ చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణంలో ఇది మడగాస్కర్‌కు ఆరు రెట్లు ఉంటుంది. పసిఫిక్ మహా సముద్రంలో 2 కిలోమీటర్ల లోతులో ఉన్న ఈ ఖండం సుమారుగా 94 శాతం నీటిలోనే ఉంది. మిగతా ప్రాంతం చిన్నచిన్న దీవులతో న్యూజిలాండ్ మాదిరిగా ఉంది.*
రాళ్లు, అవక్షేప నమూనాలపై పరీక్షలు…
డచ్ సెయిలర్ అబెల్ టాన్మాన్ 1642లో మొదటిసారిగా జిలాండియా గురించి ప్రపంచానికి తెలియజేశారు. అయితే ఆయన సరైన ఆధారాలను సమర్పించలేకపోయారు. 375 ఏండ్ల తర్వాత జీఎన్‌ఎస్ పరిశోధకులు జిలాండియా ఉనికిని నిర్ధారించారు. అక్కడ లభ్యమైన రాళ్లు, అవక్షేప నమూనాలపై పరీక్షలు చేసి కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ఖండం గోండ్వానా నుంచి ఎందుకు వేరుపడిందో శాస్త్రవేత్తలకు అంతుచిక్కలేదు.
జిలాండియా విశేషాలు
*ఖండం పేరు: జీలాండియా*
విస్తీర్ణం: 4.9 మిలియన్ చదరపు కిలోమీటర్లు (మడగాస్కర్‌కు ఆరు రెట్లు)
ఎక్కడ ఉంది: పసిఫిక్ మహా సముద్రంలో 2 కిలోమీటర్ల లోతులో
మొత్తం విస్తీర్ణంలో 94% నీటిలోనే ఉంది.